జై శ్రీమన్నారాయణ
రాగం : రేవతి
సంపుటి : 1, సంకీర్తన : 220
పాడినవిధానాం : శ్రీమాన్ బాలకృష్ణ ప్రసాద్
ఏడ వలపేట మచ్చి కేడ సుద్దులు
ఆడుకొన్నమాటలెల్ల నవి నిజాలా
తొలుకారు మెఱుపులు తోచి పోవుగాక
నెలకొని మింటి నవి నిలిచీనా
పొలతులవలపులు పోలసిపోవుగాక
కలకాలంబవి కడతేరీనా
కలలోని సిరులెల్ల కనుకూర్కులేకాక
మెలకువ చూడ నవి మెరసీనా
అలివేణుల మేలు ఆసపాటేకాక
తలపు వేంకటపతి తగిలీనా
కాంతాకనకాదులు అనాదిగా జీవుణ్ణి మాయామోహితుణ్ణి చేసి అధోగతి పాలు చేస్తున్నాయి. ఇవన్నీ అసత్యాలు! అశాశ్వతాలు! అదే విషయాన్నీ అన్నమయ్య ఈ పాటలో చక్కగా తెలియజేస్తుననాడు! మనం ప్రేమ, వలపు ఆత్మీయత, అనుకునే ఇవన్నీ నిజంగా నిజమైనవా? కాదు, ఎందుకంటే అనంత కాలగమనంలో ఎవరూ ఎవరినీ శాశ్వతంగా అంటిపెట్టుకుని ఉండరు. చనిపోయేటప్పుడు ఏకాకిగా పోవాల్సిందే! కాబట్టి మూన్నాళ్ళ ముచ్చట అయన ఈ భోలోకంలో ఉన్న బంధాలు, అనుబంధాలు, ఆత్మీయతలు అంత వట్టి బూటకాలే కదా! తొలకరి మెరుపులు, ఉరుములు అలా వచ్చి ఒక్కసారిగా గర్జించి వెళ్లిపోతాయి తప్ప వాటివల్ల ప్రయోజనం ఏమీ ఉండదు! అలాగే భామినులు వలపులు కూడా యవ్వనంలో మురిపించి సత్యాన్ని మరపించేవే తప్ప శాశ్వతాలు కావు! దూరం నుంచి చూస్తే ఎండమావులలో నీరు ఏరులై పారుతుంది కానీ దగ్గరకు వెళ్లి దాహం తీర్చుకుందామనుకుంటే ప్రయోజనం శూన్యం! ఆ విధంగానే నెలతలపై మోహము ఆశకొల్పుతుంది కానీ శాశ్వతానందాన్ని అందివ్వదు! కలలో కనిపించిన సంపద ఎలా మన చేతికి అందదో, అలాగే కాంతలపై మొహం వల్ల మేలు చేతికి అందదు సరికదా, అది భగవంతునిపై తలుపును చేర్చనివ్వదు.