Tuesday, September 22, 2020

కొండలలోనెలకొన్న కోనేటిరాయడు వాఁడు

 జై శ్రీమన్నారాయణ 

రాగం : హిందోళం 

పాడినవిధానాం : శ్రీమాన్ బాలకృష్ణ ప్రసాద్ గారు 

సంపుటి 1, సంకీర్తన 151


కొండలలోనెలకొన్న కోనేటిరాయడు వాఁడు  

కొండలంతవరములు గుప్పెడు వాఁడు 


కుమ్మరదాసుడైనకురువరతినంబి 

ఇమ్మన్నవరములెల్ల ఇచ్చినవాఁడు  

దొమ్ములు సేసినయట్టి  తొండమాంజక్కురవర్తి 

రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాఁడు 


అచ్చపువేడుకతోడ అనంతాళువారికి 

ముచ్చిలి వెట్టికి  మన్ను మోచినవాఁడు 

మచ్చిక దోలక తిరుమలనంబితోడుత 

నిచ్చనిచ్చ మాటలాడి నొచ్చినవాఁడు 


కంచిలోన నుండ తిరుకచ్చినంబిమీద కరు-

ణించి తనయెడకు రప్పించినవాఁడు 

యెంచ నెక్కుడైన వేంకటేశుడు మనలకు 

మంచివాడై కరుణ పాలించినవాఁడు 


కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరసామివారు కొండలలో  కొలువై ఉండటమే కాదు, కొండలంతవరాలను గుప్పే దొడ్డదొర అని అన్నమయ్య ఈ పాటలో కీర్తిస్తున్నారు. రాజు అర్పించిన బంగారు పూలను వద్దని, మహాభక్తుడైన కురువనంబి (కుమ్మరిదాసు) అర్పించిన బంకమట్టి పూలను స్వీకరించి అనుగ్రహించిన ఉన్నతోన్నతమూర్తి వేంకటేశ్వరుడు!  ఆశ్రితుడైన  తొండమాన్ చక్రవర్తికి శంఖచక్రాలను అనుగ్రహించినవాడు శ్రీనివాసుడు! అనంతాళ్వార్ల  వారి పుష్పకైంకర్యాన్ని స్వీకరించి అనుగ్రహించినవాడు స్వామి! తిరుమలనంబిని బ్రోచినవాడు! భక్తుడైన తిరుకచ్చినంబిని కంచి నుండి తన వద్దకు రప్పించుకున్నవాడు! అట్టి వేంకటేశ్వరుడు భక్తులైన మనందరినీ అపారమైన కరుణతో పాలిస్తున్నాడు అని ఆచార్యులవారు అంటున్నారు. 

 


No comments:

Post a Comment