జై శ్రీమన్నారాయణ
రాగం : ముఖారి
సంపుటి : 1, సంకీర్తన : 191
పాడిన విధానం : శ్రీమాన్ బాలసుబ్రమణ్యం
స్వరకల్పన : రమేష్ నాయుడు గారు
బ్రహ్మ కడిగిన పాదము
బ్రహ్మము తానె నీ పాదము
చెలఁగి వసుధ గొలిచిన నీ పాదము
బలితల మోపిన పాదము
తలకక గగనము తన్నిన పాదము
బలరిపు గాచిన పాదము
కామిని పాపము కడిగిన పాదము
పాము తలనిడిన పాదము
ప్రేమపు శ్రీసతి పిసికెడి పాదము
పామిడి తురగపు పాదము
పరమయోగులకు పరిపరి విధముల
వర మొసగెడి నీ పాదము
తిరువేంకటగిరి తిరమని చూపిన
పరమపదము నీ పాదము
త్రివిక్రమాకృతి (వామనావతారంలో) దాల్చినపుడు స్వామీ వారి పాదం బ్రహ్మలోకానికి వ్యాపించినదిట! అప్పుడు బ్రాహాముదేవుడు స్వామీ పాదాన్ని అభిషేకిస్తాడు! అందుకే అన్నమయ్య బ్రహ్మకడిగిన పాదము అని అంటున్నాడు. అట్టి ఈ పాదము సకలలోకాలకు పరబ్రహ్మమైనది! ఈ పాదం వసుధనే కొలిచినది! బలి తలను పాతాళానికి త్రొక్కినది! ఆకాశాన్నింటినది! అహల్య పాపాన్ని ప్రక్షాళన చేసినది! కాళిందునిపై నాట్యమాడినది! ప్రేమతో శ్రీసతి చేత ఆరాధింపబడేది! కల్క్యావతారంలో గుర్రాన్ని అధిరోహించేది! పరమయోగులకు అనేక విధాలుగా ముక్తిని అనుగ్రహించేది! అట్టి ఈ పాదము కలియుగంలో వేంకటాద్రి పై కొలువైనది! పరమపదాన్ని అందించే ఈ పాదాన్ని ఆశ్రయిద్దాం! ధన్యులమవుదాం!!
No comments:
Post a Comment