వందే ముకుందం అరవింద దళాయతాక్షం
దిగ్వాసతం కనకభూషణభూషితాంగం
విసృస్తకేశం అరుణాదర మాయతాక్షం
కృష్ణం కృష్ణం నమామి శిరసా వసుదేవసూనం
మిత్రులకి శుభసాయంత్రం,
మీ అందరిని మహపురుషుని తలుచుకునే సమయంలో కలుసుకోవడం ఎంతో ఆనందాన్ని ఇస్తోంది.
ముందు చెప్పిన పజ్యం ఎక్కడ పుట్టిందో, అది ఎలా పుట్టిందో, తెలుసుకుందాం.
గొదావరి పావనోదార వాక్పూరమఖిలభారతము మాదన్ననాడు
తుంగభద్రా సముత్తుంగరావముతోడ కవుల గానము శ్రుతి కలయునాడు
పెన్నానది సముత్పన్న కైరవదళ శ్రేణిలో తెలుగు వాసించునాడు
క్రిష్ణా తరంగ నిన్నిద్రగానముతోడ శిల్పమ్ము తొలిపూజ చేయునాడు
అక్షర జ్ఞామెరుగదో ఆంద్ర జాతి విమలకృష్ణానది సైకతములందు
కొకిలపు బాట పిచ్చుక గూళ్ళు గట్టి నేర్చుకున్నది పూర్ణిమా నిశలయందు
తెలుగు మొదటి జ్ఞానపీఠ అవార్డ్ గెలుచుకున్న, కవి సామ్రాట్ శ్రీ విశ్వనాధ్ సత్యన్నారయణ గారు తెలుగువాడి పౌరుషం కొసం రాసినది, ఎందుకు నేను ఈ పజ్యాన్ని ఉటంకిస్తున్నాను అంటే, మన అందరి పాటల బేహారి వేటూరి గారికి అమితంగా ఇష్టమైన వారు శ్రీ విశ్వనాథ్ సత్యన్నారయణ గారు. వారిలో సాహిత్యనికి తొలిమొలకలు పడదానికి కారణం వారి పెద్దనాన్నగారు శ్రీమాన్ వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు, తండ్రిగారు శ్రీమన్ వేటూరి చంద్రసేఖర్ గారు అయితే, ముందుగా చెప్పిన క్రిష్ణ పజ్యం లాంటి సంగీత నాటకాలు రాయడానికి ప్రేరణ సత్యన్నారయణ గారుట. అందునా వారు వారి స్టూడెంట్ కూడా, యస్ ఆర్ ఆర్ - సి వి ఆర్ డిగ్రీ కలాశాలలో.
మొన్న ఒక మిత్రులు గ్రూప్ లో అన్నమయ్య చిత్రం లోని తెలుగు పదానికి జన్మదినం ఇది జానపదానికి జ్ఞానపదం పాటను జ్ఞాపకం చేసారు, అప్పుడు అన్నా కూడ, పెద్ద నాన్నగారి ప్రభావం ఆమాత్రం ఉండదా అని. వారు 12 - 13 సంవత్సరాల వయసులో ఉండగా తరచు తిరుపతి వెళ్ళేవారట. అక్కడ శ్రీమాన్ వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారి ఇంటికి. కొందరు మిత్రులకి ప్రభాకర శాస్త్రి గారి గురుచి తెలియక పొవొచ్చు, ఈ రొజు మనం అన్నమయ్య సంకీర్తనలు వినగలుగుతున్నం, పాడగలుగుతున్నాం అంటే, దానికి కారణం అయిన కొందరు కారణజన్ముల్లో శ్రీమాన్ వేటూరి ప్రభాకర శాస్త్రి గారు ఒకరు, మన కవి గారికి 12-13 సంవత్సారాలు అంటే స్వాతంత్రానికి కొద్దిగా ముందు, తిరుపతిలో అన్నమయ్య సాహిత్యన్నికి పరిష్కరించే వాళ్ళు, వారిలొ రాళ్ళ పల్లి అనంత క్రిష్ణ శర్మ గారు, నేదునూరి క్రిష్ణ మూర్తి గారు, శ్రీపాద పినాకపాని గారు, గౌరిపెద్ది రామసుబ్బ శర్మగారు, శ్రీమాన్ మంగళంపల్లి బాలమురళి క్రిష్ణ గారు, ఇల్లాంటి పెద్దలని కలిసే అవకాశం మన కవిగారికి దొరికేది, అక్కడే వారి ప్రస్థానానికి విత్తనం పడింది.
మొన్న ఒక ఆడియొ క్లిప్ పెట్టా కదా, గుర్తుందా, అక్కడికి వెళదాం.
సిరికాకొలను చిన్నది.
ఇది రాయలనాటి తెలుగునాటి సంస్కృతీ, ప్రజా జీవన ధోరణీ ప్రతిబించించే కథ. స్థలం కృష్ణానదీ తీరస్థమై ఆంధ్రవిష్ణు క్షేత్రంగా చరిత్రలో వాసికెక్కిన శ్రీకాకుళం.
ఆ ఊళ్ళో ప్రతి వైకుంఠ ఏకాదశికి తిరునాళ్ళు - కాముని పున్నమి అని, దవన పున్నమి అనీ ప్రసిద్ధి గాంచిన శృంగార రాత్రికి నటవిటరసిక జన సందోహమంతా తరలివచ్చి తనివితీరా పొరలి వెళ్లే పొతుగడ్డ. అక్కడొక సానివాడ. అందొక రంగాజమ్మ.
ఆమె వయసు మళ్ళిన వాడ వదిన - ఆమెకు అందాలరాశి, భక్తికి వారాశి అయిన అలివేణి గారాల కూతురు. కళలూ, కావ్యాలూ అన్నీ నేర్చిన చిరుజాణ, మువ్వను కవ్వించడం, మువ్వగోపాలును నవ్వించడం ఆమె ఇష్టక్రియ. ఆమెకొక అక్క, పేరు చంచల. పరమ కర్మిష్ఠులనైనా పాదక్రాంతులను చేసుకొనగల కులవృత్తి విద్యాకిరణదృగంచల. మరో చిట్టి చిలక పాప - పేరు జలజ, ముక్కు పచ్చలారుతున్నా అక్క అలివేణి దిక్కుగా వుండి ఆమెనీ, ఆమె భక్తినీ ఆరాధిస్తూ, అనుసరిస్తూ వుండే సిరిమల్లి.
శ్రీకృష్ణదేవరాయలు కళింగదేశ విజిగీషా మనీషతో ఉత్తరాపథ జైత్రయాత్రకు వెడుతూ విజయవాడలో విడిది చేసిన రాత్రి. చేరువలో ఉన్న శ్రీకాకుళస్వామిని దర్శించాలనే సంకల్పం కలగడమూ, ఆ మరునాడు యాధృచ్ఛికంగా వైకుంఠ ఏకాదశి కావడమూ, తన వెంటవున్న ఆంధ్ర కవితా పితామహుడు అల్లసాని పెద్దన్న గారితో సహా కదలి అక్కడికి వెళ్లడమూ, ఆ సుమూహూర్తానే గజ్జెపూజ చేసి నాట్యం చేయబోతున్న అలివేణిని చూడటమూ, ఆమె భక్తి తత్పరతకు మెచ్చి దేవదాసిగా జీవితం గడపాలనే ఆమె అభీష్టానుగుణంగా దేవదాసీత్వం విధించడమూ విటభుజంగాలకు విపణిమణిగా చేయాలనుకున్న రంగాజీ తలపు తలక్రిందులై దేవవేశ్యా భుజంగుడైన శ్రీకాకుళస్వామికి చెలిగా కన్న కూతురు బలికావటమూ ఇలా జరుగుతూ ఉంతుంది, అక్కడి నుండి సంఘర్షణ, అదే ఈ కథ.
ఈ గాథ వైకుంఠ ఏకాదశి పరవడి తిరునాళ్లతో, అలివేణి నాట్య మంటపానికి చేరడంతో ప్రారంభమౌతుంది. ఈ దృశ్య కావ్యంలో భక్తి శృంగారం ఆత్మ. ఆస్తికతా పునరుద్ధరణ మహాయజ్ఞంలో అలివేణి సమిధ.
ఆ హవిస్సులు మీరూ రసజ్ఞులై ఆఘ్రాణించండి. దివ్యభక్తి వేదాంత గహనాంతరాలలో విహరించండి.
ఈ సంగీత నాటిక అండి, ఈ రోజు మనల్ని ఇక్కడ ఒకటి చేసింది.
మన అభిమాన కవి శ్రీ వేటూరి గారు రచించిన ఈ సంగీత నాటకం సిరికాకొలను చిన్నది
ఆకాశవాణి పత్రిక ‘వాణి’లో ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల ప్రకటన చూసి 1969లో ఒకనాడు రేడియోస్టేషనుకు వెళ్ళి శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు గారిని కలిసారట. “ఈ ఉద్యోగాలు నీకెందుకయ్యా! మంచి సంగీతనాటిక రాసి ఇవ్వు ప్రచారం చేద్దాం” అన్నారుట.
ఈ నాటిక గురించి వేటూరి వారు ఎమ్మాన్నారో చూడండి.
ఎన్నాళ్ళనుంచో ఈ ‘సిరికాకొలను చిన్నది’ అంతరంగ స్థలం మీద అప్పటికే గజ్జె కట్టి ఆడుతూ వుండేది. కూనిరాగాలు తీస్తూ ఉండేది. శ్రావణిగా, సుధాలాపసుందరిగా వినిపించేది. నర్తనబాలగా, ముకుందమాలగా కదిలేదీ కదిలించేది. మురిపిస్తూనే ముముక్షువును చేసేది. రజనీకాంతరావుగారి మాటతో, మా తండ్రిగారి (డాక్టర్ వేటూరి చంద్రశేఖరశాస్త్రి గారు) ఆజ్ఞతో వెంటనే మద్రాసు వెళ్ళి రాత్రింబవళ్ళు రాసి ఈ అందాలరాశిని నేను తొలిసారిగా అక్షరాలా చూసుకున్నాను. పద్యాలు, పదాలు, పాటలు, గద్యాలు, పలు విన్యాసాలు! రేడియో నాటిక గదా అని చాలా కుదించాను.
అంతకుముందు రూపక రచనలో చేయి తిరిగినవాడను కాను. రాగతాళాలకు, స్వరకల్పనకు సరి తూగుతుందో లేదో అని సందేహం వచ్చింది. వెంటనే నాకు ఆప్తులు, బంధువులు అయిన సుప్రసిద్ధ సంగీత దర్శకులు శ్రీ పెండ్యాల నాగేశ్వరరావు గారికి ఈ కాగితాలన్నీ యిచ్చి నా సందేహం చెప్పాను.
దాదాపు రెండుగంటలపాటు వంచిన తల ఎత్తకుండా ఆయన నాటిక అంతా చదివి, “దీనికి సంగీతం నేనే చేస్తాను” అంటూ రజనీకాంతరావు గారికి ఫోను చేశారు. “మీరు చేస్తే అంతకన్నా కావలసిందేముంది. అయితే ఆ స్క్రిప్టు నేను ఇంతవరకూ నేను చూడలేదు. అది వెంటనే పంపమనండి” అన్నారు రజనీగారు.
అటు తరువాత రజనీకాంతరావు గారి సూచనల మేరకు దానిని మరింత తగ్గిస్తే ఒకటిన్నర గంటల నాటిక అయింది. అప్పటికి గంటకు మించి ఆకాశవాణి రూపకాలు లేవు. కానీ సాహితీ సంగీత పక్షపాతులు, స్వయంగా కవీ, సాహితీవ్రతులూ అయిన రజనీకాంతరావు గారు సిరికాకొలను చిన్నది నాటికను గంటన్నర కార్యక్రమంగా ప్రత్యేక అనుమతి పైనుంచి తెప్పించి మరీ ప్రసారం చేశారు. పునః పునః అనేకసార్లు ఈ నాటిక ప్రసారం అయింది. తెలుగు సాహితీపరుల ఆదరాభిమానాలకు నోచుకుంది. శ్రీ పెండ్యాలగారు విజయవాడలో 20 రోజులు వుండి దీనిని ఒక యజ్ఞంగా నిర్వహించి స్వరబద్ధం చేశారు.
ఇది కథో కల్పనో నాకు తెలియదు. కానీ ఇది సజీవశిల్పం. ఈ శిల్పం చెక్కడానికి ఉలి, ఊపిరి, శిలా, వైఖరి మాత్రం నా మాతామహుల వారసత్వం. అందుకే ఇది వారికే అంకితం.
తన వాణితో తెలుగు నేలను పులకింపజేసి ఆకాశవాణిగా, అశరీరవాణిగా, అందని లోకాలలో అమరగాయనిగా మిగిలిపోయిన కుమారి శ్రీరంగం గోపాలరత్నం గారు కథానాయిక ‘అలివేణి’గా అందరి హృదయాలలో నిలిచిపోయారు.
శ్రీ వోలేటి వెంకటేశ్వర్లు. శ్రీ శ్రీగోపాల్, శ్రీ మల్లిక్, శ్రీ ఎన్.సి.వి. జగన్నాధాచార్యులు, మరెందరో ఈ చిన్నదానికి సింగారాలు దిద్దిన మహనీయులు. అందరికీ శిరసు వంచి పాదాభివందనాలు చేయడం తప్ప నేనేమి చేయగలను! అంటారు వేటూరి గారు.
మీరంత వారి పాటల ప్రయణాన్ని చెప్తారు కదా అని, నేను సిరికకొలను చిన్నదాని మీకొసం చెప్పాలనుకొన్నా, దర్శకులు శ్రీ విశ్వనాధ్ గారు ఈ సంగీత నాటికని రేడియొ లొ విని ఓ సీత కధ లొ భారతనారి చరితము హరికధను రాయమని అడిగారు, అలామొదలయింది వారి సినీ ప్రస్థానం, అంతకుముందు వారికి చిత్తూరు నాగయ్య గారు, ఎన్ టి రామరావు గారు నటించమని అడిగినా తిరస్కరించారుట.
ఈ అవకాశాల కలిమి దశకూ,
అవకాశాల లేమి దశకూ సంధికాలంలో
కవిపుంగవుడొకడు పుట్టుకొచ్చాడు.
ఈ పురుషుల్లోని పుంగవుడు పులకింతొస్తే ఆగేరకం కాదు.
కవితా ధనువు పట్టుకుని విజృంభిస్తుంటాడు.
పాటల శర సంధానం చేస్తుంటాడు.
జన హృదయాలను ఛేదించి రసానందాన్ని ఉప్పొంగిస్తుంటాడు.
ఇదంతా సుమారు పదేళ్ళ క్రితం మాట.
ఇప్పుడా ధనుర్ధారి లేడు.
కానీ ఆయన సంధించిన బాణాలు మాత్రం లక్షలాది తెలుగువాళ్ళ హృదయాలలో దిగబడిపోయే ఉన్నాయి.
ఆ కవితాశర సంధానకర్త,
తెలుగు సినీసాహితీప్రియ హృదయహర్త
శ్రీ వేటూరి సుందర రామమూర్తి గారికి నమస్కరిస్తూ
మీ
శ్రీనాధ పద్మచరణ్